డోనల్డ్ ట్రంప్‌: అధ్యక్షుడిపై అభిశంసన ఆరోపణలను తోసిపుచ్చిన సెనేట్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌‌ మీద వచ్చిన అభిశంసన ఆరోపణలను సెనేట్‌ తోసిపుచ్చింది. దాంతో, ట్రంప్‌ను పదవీచ్యుతుడ్ని చేసే ప్రయత్నాలకు పూర్తిగా తెరపడింది.


అధ్యక్షుడి సహచరులైన రిపబ్లికన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న సెనేట్‌లో ట్రంప్ మీద వచ్చిన అభిశంసన అరోపణలు రెండూ వీగిపోయాయి. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణను సెనేట్ 52-48 ఓట్లతో తోసిపుచ్చింది. అలాగే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే ఆరోపణ కూడా 53-47 ఓట్లతో చెల్లకుండాపోయింది.


అధ్యక్ష పదవికి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉన్న డెమొక్రటిక్ ప్రత్యర్థిపై బురదజల్లాలని ట్రంప్ ఉక్రెయిన్ మీద ఒత్తిడి తెచ్చారని, ఆ విధంగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని గత డిసెంబర్ నెలలో డెమొక్రాట్లు ఆరోపించారు.